విజయోత్సవ సంబరాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం

విజయోత్సవ సంబరాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం
  • ర్యాలీలు చేస్తే కేసులు పెట్టండి.. పోలీసు అధికారులను సస్పెండ్ చేయండి –ఈసీ ఆదేశం

న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచిన చోట్ల పార్టీల అభ్యర్థులు విజయోత్సవాలు జరుపుకోవడం, బాణ సంచా కాల్చడంపై కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఒకవైపు కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంటే గుంపులు గుంపులుగా గుమిగూడుతుంటే కంట్రోల్ చేయాల్సిన పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. విజయోత్సవ సంబరాలు జరుపుకున్న ప్రాంతాల్లోని పోలీసు అధికారులు(స్టేషన్ హౌస్ ఆఫీసర్లు)ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, అస్సోం, కేరళ,తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. వీటితోపాటు పలు రాష్ట్రాల్లో అభ్యర్థులు చనిపోయిన చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జునసాగర్ అసెంబ్లీకి, తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఇవాళే జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద.. నియోజకవర్గాల్లో సంబరాలు జరుపుకుంటున్న వీడియోలు టీవీల్లో ప్రసారం అవుతుండడం గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. కరోనా మహమ్మారి సునామీలా చుట్టేస్తూ జన జీవితాలను కకావికలం చేస్తున్న నేపథ్యంలో 144 సెక్షన్ లాంటి పరిస్థితి అమలు చేయాలని.. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి చేస్తూ.. విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ వేడుకలు జరపవద్దని నిషేధాజ్ఞలు విధించినప్పటికీ కొన్నిచోట్ల అతిక్రమిస్తుండడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ర్యాలీలు చేసిన, సంబరాలు నిర్వహించిన వారిని గుర్తించి అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని.. ఇంకా ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు చేపడితే కేసులు నమోదు చేయడంతోపాటు.. ఆ ప్రాంత సబ్ ఇన్స్ పెక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలను నిర్ధారించుకుని కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.